కక్షా రాజకీయాలకు ఇక్కడ చోటులేదు - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

కందుకూరులో త్వరలో ప్రజాదర్బార్ 

మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా చూస్తా 

కక్షా రాజకీయాలకు ఇక్కడ చోటులేదు 

ఇకనుంచి సరికొత్త పాలనకు శ్రీకారం - ఇంటూరి నాగేశ్వరరావు 

బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు ఘనసత్కారం 

BSBNEWS - KANDUKUR 23-06-2024.



రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో, ఆయన మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని త్వరలో కందుకూరు నియోజకవర్గంలో కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రకటించారు. కందుకూరు బ్రాహ్మణ బంధువుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులను ఆదివారం ఘనంగా సత్కరించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే దంపతులను పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి జనార్ధన స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూర్ణకుంభ స్వాగతంతో జనార్ధన స్వామి దర్శనం చేయించి, పూజలు నిర్వహించి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. తరువాత ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా వారి ద్వారానే తెలుసుకుని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలన్న ఉద్దేశంతో... మంగళగిరిలో జరుగుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని త్వరలో కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించబోతున్నట్లు చెప్పారు. కందుకూరు మున్సిపాలిటీకి 15 సంవత్సరాలుగా ఎన్నికలు జరగడంలేదని, దానివలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలుసన్నారు. పాలకవర్గం ఏర్పాటై, కౌన్సిలర్లు ఉండి ఉంటే... తమ సమస్యలను వారికి చెప్పుకునే అవకాశం ప్రజలకు ఉండేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో, అడ్డంకులను తొలగించి, త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు నాగేశ్వరావు చెప్పారు. మరోవైపు కందుకూరు పట్టణ ప్రజలు ఇన్నాళ్లుగా రకరకాల ప్రచారాలతో ఆందోళనకు గురయ్యేవారని, ఇకపై ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు.   శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కందుకూరులో చిన్న సంఘటన కూడా జరగనిచ్చే ప్రసక్తే లేదని నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణ సోదర సోదరీమణులు అందరూ తనకు పూర్తిగా అండగా నిలబడ్డారని, తనకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారని నాగేశ్వరరావు అన్నారు. బ్రాహ్మణులకు చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే, వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గుడ్లూరి వెంకన్న కవి, తాను వ్రాసిన సన్మానపత్రం చదివి సమర్పించగా... ఎమ్మెల్యే దంపతులకు ఘన సన్మానం జరిగింది.  మంచిరాజు మురళీ మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు, బ్రాహ్మణ సమాఖ్య నేతలు పెట్లూరి సుబ్బారావు, శ్రీరామగిరి శ్రీరామచంద్రమూర్తి, నందనవనం రామసుబ్బారావు, ఇప్పగుంట మాధవరావు, నాగరాజారావు, రావులకొల్లు. వెంకటేశ్వర్లు(ఆర్.వి ), పవని నాగేంద్రప్రసాద్, గాయత్రీ కాలేజీ రామకృష్ణ, చలంచర్ల సుబ్బారావు, చలంచర్ల రమణమూర్తి, నారాయణం రాధాకృష్ణమాచార్యులు, మధు, సింగంపల్లి నాగేశ్వరరావు, బ్రాహ్మణ బంధువులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)