గ్రంథాలయం విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లుతుంది - పాలపిట్ట దీర్ఘ కావ్య రచయిత ముప్పువరపు కిషోర్
BSBNWES - KANDUKUR
అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళని కదిలిస్తుందని పాలపిట్ట రచయిత ముప్పువరపు కిషోర్ అన్నారు. స్థానిక శాఖ గ్రంధాలయం ఆధ్వర్యంలో పౌర శాఖ గ్రంధాలయం నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్పవరపు కిషోర్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో గ్రంథాలయ ఉద్యమం విద్యార్థులను యువతను మేధావులను సమీకరించింది, సాహిత్యము, శాస్త్ర సాంకేతిక విజ్ఞానము గ్రంధాలయం అందించి విజ్ఞాన కేంద్రముగా విరాజిల్లుతుందని ఆయన అన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాలపిట్ట పుస్తకం పరిచయం చేయటం విద్యార్థులకు అందించటం ఆనందకరమైన విషయం అని అన్నారు. లైబ్రరీలో సాహిత్య సాంస్కృతిక చరిత్ర శాస్త్ర శాస్త్రీయ విజ్ఞాన పుస్తకాలు లభ్యమవుతాయని ప్రతి ఒక్కరు పుస్తకాలు చదివి గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథ పాలకురాలు నాగరజని మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయుటకు వకృత పోటీలు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, పుస్తక పరిచయ సభలు నిర్వహించడం జరిగినది అని, విద్యార్థులందరికీ బహుమతులతో పాటు పుస్తకాలను కూడా బహుకరించడం జరిగినది అని అన్నారు. దమ్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షులు ఉపాసకులు గాండ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రీయ అధ్యయనం చేయటానికి గ్రంథాలయాలను దేవాలయాలుగా భావించి విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అమ్మ ఫౌండేషన్ వెల్ఫేర్ అధ్యక్షులు బివి రమణ మాట్లాడుతూ విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకు పోటీ పడటానికి గ్రంథాలయాలను నిరుద్యోగ యువత విరివిగా ఉపయోగించుకోవాలని కోరారు. శ్రీవారి సేవా సమితి అధ్యక్షులు ఏవిఆర్ మూర్తి మాట్లాడుతూ పుస్తకాలు అధ్యయనం చేయడం ద్వారా మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం పొందిన వారు అనేకమంది ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని పుస్తకాలు చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలోగ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చిల్లర సుబ్బారావు,పగడాల రోశయ్య, ఎస్కే ఖాదర్ భాష, జి శ్రీనివాసులు, సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.