మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై దర్యాప్తు జరపాలి
- జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
BSBNEWS - ONGOLE 23 - 06 - 2024
గత ఐదు సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు. ఈనెల 23వ తేదీన ఒంగోలు పట్టణంలోని రంగా భవన్ లో ప్రకాశం జిల్లాలో అక్రమాలు అవకతవకలపై జరిగిన మీడియా సమావేశంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తోపాటు ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు, రిటైర్డ్ అడిషనల్ యస్.పి సుంకర సాయిబాబు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు డాక్టర్ కంచర్ల సుబ్బారావు, ప్రముఖ అడ్వకేట్ ఎన్. దేవ కుమారి తదితరులు ప్రసంగించారు. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్ లతో ఒంగోలు పట్టణాన్ని భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం 90 కోట్లు కేటాయించిన టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు మధ్యలోనే ఆ పని నిలిపి వేశారని, నిర్మించిన సైడ్ వాల్స్ వర్షాలకు కూలిపోయాయని తెలిపారు. పోతురాజు కాలువ అవకతవకలపై లోకాయుక్త లో కేసు నమోదు అయ్యి విచారణ జరుగుతుందన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి బంధువు నిర్మిస్తున్న విల్లాల లెవలింగ్ కోసం అక్రమంగా కోట్లాది రూపాయల గ్రావెల్ తరలించటం,విల్లాల నిర్మాణ స్థలంలో వాగు పోరంబోకును కలుపుకోవటం పై దర్యాప్తు జరగాలన్నారు. ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమ తవ్వకాలపై భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. గత రెండు దశాబ్దాల కాలంగా ఒక్క భారీ పరిశ్రమ ప్రకాశం జిల్లాకు రాలేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పేకాట, బెట్టింగ్ లాంటి వ్యసనాలకు లోనై రాజకీయాలను బ్రస్టు పట్టించారన్నారు. ఒంగోలు పట్టణ నీటి సరఫరా కోసం మూడు సంవత్సరాల క్రితం 335 కోట్లు కేటాయించినా నేటికీ వినియోగానికి రాలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాలేదని దాదాపు పదివేల మంది నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే వాటిని సైతం నేటికీ పునరుద్ధరించలేదన్నారు. 80 శాతం పైగా పూర్తి అయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. ఒంగోలు నగరానికి దూరంగా 450 ఎకరాలు మార్కెట్ ధర కన్నా రెట్టింపు ధరలతో కొనుగోలు చేసి హడావుడిగా 25 వేల పట్టాలు ఇచ్చారని ఇందులో 50 కోట్ల రూపాయలు చట్టబద్ధ దోపిడీ జరిగిందన్నారు. సుపరిపాలన ఉపాధ్యక్షులు డాక్టర్ కంచర్ల సుబ్బారావు ప్రసంగిస్తూ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఎన్నికల సందర్భంగా నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తద్వారా రామాయ పట్నంలో ఓడరేవు ప్రకాశం జిల్లాలోకి రావటం వలన పరిశ్రమలు వచ్చి ఉపాధి లభిస్తుందని, దొనకొండ పారిశ్రామిక నడవ, కనిగిరి పారిశ్రామిక వాడ కేంద్ర ప్రభుత్వం ద్వారా త్వరగా అమలు లోకి తీసుకుని వచ్చి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ జిల్లాలో వెటర్నరీ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజి లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు ప్రసంగిస్తూ 136 సంవత్సరాల చరిత్ర గల ఒంగోలు మున్సిపాలిటీ 25 సంవత్సరాల కార్పొరేషన్ నేడు నీటి సమస్య, రోడ్ల సమస్యలతో సతమతమవుతున్నదని అన్నారు. జిల్లా విభజన సందర్భంగా సంతనూతలపాడును ప్రకాశం జిల్లాలోకి పోరాట ఫలితంగా పొందగలిగినామని అద్దంకిని కూడా చేర్చి మార్కాపురం ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ఒంగోలు నగరంలో మాస్టర్ ప్లాన్ ను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ అడిషనల్ యస్.పి సుంకర సాయిబాబు ప్రసంగిస్తూ ఇటీవల బాలిక అత్యాచారానికి అనంతరం హత్యకు గురైన రెండు రోజుల్లోనే దోషులను పట్టుకోవడం నూతన ప్రభుత్వ నిజాయితీకి నిదర్శనం అన్నారు. ప్రకాశం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ న్యాయవాది ఎన్. దేవ కుమారి మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ నగర ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పన్నులు వసూలు చేస్తూ తక్కువ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. ఒంగోలు పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కరువు జిల్లాగా మారి వలసల కేంద్రంగా రూపొందిందని, పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే వలసలను నివారించగలుగుతామని అన్నారు. గత పాలకుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని నేటి పాలకులు అభివృద్ధి పాలన చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.