ఆర్థిక అవినీతి కన్న రాజకీయ అవినీతి అత్యంత ప్రమాదకరం - జి.ఈశ్వరయ్య

0

 ఆర్థిక అవినీతి కన్న రాజకీయ అవినీతి అత్యంత ప్రమాదకరం

స్వర్గీయ పూల సుబ్బయ్య వర్థంతి సభలో

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య

BSBNEWS - MARKAPURAM


దేశంలో అన్ని రంగాలలో అవినీతి విలయతాండవం చేస్తుందని, ఆర్థిక అవినీతి కన్నా రాజకీయ పార్టీల నాయకులు అవినీతి అత్యంత ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు, స్వర్గీయ పూల సుబ్బయ్య 37 వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక పూల సుబ్బయ్య శాంతిభవన్లో నియోజక వర్గ సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు స్వర్గీయ పూల సుబ్బయ్య, తాయమ్మ దంపతుల విగ్రహాలకు  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పూర్తిగా విస్మరించి వేల కోట్ల రూపాయలను వ్యయం చేయడం జరిగిందని ఆందోళన చేశారు. అంతేకాకుండా ప్రజల సమస్యలపై ఏమాత్రం అవగాహన లేకపోగా మరోవైపు ప్రజలతో నిత్యం సంబంధాలు లేని వ్యక్తులు కూడా ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా విజయం సాధించడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఒకప్పుడు ఎన్నికల్లో ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తులను, పార్టీలను ప్రజలు అసెంబ్లీకి పార్లమెంటుకు ఓటర్లు పంపేవారని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద తక్షణం నిధులను మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వంలో ముంపు గ్రామ బాధితులకు నష్టపరిహారం అందించకుండా మరోవైపు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా జాతికి అంకితం చేయడం ఈ ప్రాంత ప్రజలను అవమాన పరచడమేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని తీరును  విమర్శించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, అట్టడుగు వర్గాల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీలో చేరి తుదిశ్వాస వరకు అదే పార్టీలో కొనసాగిన మహోన్నతమైన నేత స్వర్గీయ పూల సుబ్బయ్య అని ఆయన సేవలను కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సిపిఐ నాయకులు పూల సుబ్బయ్య, గుజ్జుల యల్లమందారెడ్డి,రావులపల్లి చెంచయ్య ల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల పలితంగానే నేడు ప్రాజెక్టు రూప కల్పన జరిగిందని ఈశ్వరయ్య గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ కార్మిక, కర్షక, అట్టడగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం రాజీలేని పోరాటాలు చేసిన పార్టీ సీపీఐ అని అన్నారు. మోడీ గత పది సంవత్సరాల పరిపాలన కాలంలో దేశం అన్ని రంగాలలో పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందని,పలితంగా దేశంలో లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో నిరుద్యోగ సమస్య విలయ తాండవం చేస్తుందని,  గతంలో ఎన్నడు లేనివిధంగా నిత్యవసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయని  ఆందోళన వ్యక్తం చేశారు. లాభాలు తో నడుస్తున్న ఎల్ఐసి, రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ డిపార్ట్మెంట్ వివిధ పోర్టులను నష్టాల బాట చూపుతూ లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ప్రజా సంపదను మోడీ ప్రభుత్వం కారు చౌకగా అధాని,అంబానీలకు అప్పచెబుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎస్ కె.కాసిమ్,ఏపీ ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు కే. ఎర్రయ్య, సిపిఎం నాయకులు గుమ్మా బాల నాగయ్య, పూల సుబ్బయ్య కుమార్తెలు సుభాషిని, సునందిని, ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు ఏలూరి వెంకటరెడ్డి మరియు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)