కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందాం - ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందాం
అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరిక
ఆరు నెలల్లోగా మున్సిపాలిటీకి ఎన్నికలు
ఎమ్మెల్యేగా గెలిచాక మొదటిసారిగా మున్సిపల్ ఆఫీసుకు వెళ్లిన ఎమ్మెల్యే... అభివృద్ధి పనులపై సమీక్ష
అన్న క్యాంటీన్ పనుల పరిశీలన
కందుకూరును ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, నాయకులు పనిచేయాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మున్సిపల్ కార్యాలయంలోకి గురువారం మొదటిసారిగా అడుగుపెట్టిన ఎమ్మెల్యే వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు, సమస్యలపై ముందుగా అధికారులు, నేతలతో చర్చించి, పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో, ఆరునెలల లోపు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు తయారు సిద్ధం చేయాలని కమిషనర్ కేవీ కృష్ణారెడ్డికి సూచించారు. లేఅవుట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని, ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి లేఅవుట్ లో 30 అడుగుల వెడల్పు ఉండేలా రోడ్లు, చక్కటి డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు ఆయన గట్టిగా చెప్పారు. వర్షాకాలం వస్తున్నందున శివారు కాలనీల్లోకి నీరు చేరకుండా ఇప్పటినుంచే చర్యలు మొదలుపెట్టాలని, సైడ్ కాలవలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి ఉంటే అలాంటి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీకి ఆదాయం పెరిగేటట్లు చూడాలని కోరారు. స్మశానాలలో మౌలిక వసతులు సరిగా లేవని, దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ప్రస్తావించగా ఎమ్మెల్యే అక్కడి నుంచే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ సెంటర్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ అతి త్వరలోనే క్యాంటీన్ పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. క్యాంటీన్ బయట మురుగు కాలవనుంచి దుర్వాసన వస్తున్నందువల్ల, అక్కడ కాలుపై వెంటనే స్లాబ్ వేయాలని కమిషనర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఇతర నాయకులు, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.