టి ఆర్ ఆర్ లో విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించిన సిఐ కే. వెంకటేశ్వరరావు
BSBNEWS - KANDUKUR [20/09/24]
కందుకూరులోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. వెంకటేశ్వరరావు కళాశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కందుకూరు సిఐకే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎటువంటి మార్పులు చేర్పులు వస్తాయి అనే విషయాల మీద విద్యార్థులకు వివరించారు. సమాజంలో మనిషి ఏ విధముగా గుర్తింపు తెచ్చుకొని గౌరవం గా జీవించాలంటే దానికి సంబంధించిన విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు. విద్యార్థి దశలో కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని అటు తల్లిదండ్రుల మాటలు వింటూ ఇటు కళాశాలలోని అధ్యాపకులు చెప్పిన పాఠాలను జీవిత పాఠాలను అణువణువు నింపుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని తెలిపారు. విద్యార్థులు ఎవరు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సోషల్ మీడియా వైపు ఆకర్షితుల కాకుండా చెడు సావాసాలకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలని తెలిపారు. చక్కగా చదువుకొని అధ్యాపకుల మాటల మూటను ఒమ్ము చేయకుండా తల్లిదండ్రుల ఆశలకు ఆశయాలకు గండి కొట్టకుండా ప్రతిభతో విలువలతో జీవించాలని, ఇప్పటి నుండే ఒక మార్గదర్శకాన్ని తయారు చేసుకొని తదనుగుణంగా అడుగులు వేసి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని తెలిపారు. క్రమశిక్షణ పట్టుదల రెండు కళ్ళుగా చేసుకొని నీవు నీవుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. మనకు మనమే హీరో అనే విధముగా విద్యార్థి జీవితంలో ఉండి సాధించాలని ఏది కూడా అంతా సులభముగా రాదు అని, కష్టపడితేనే జీవితము సుఖమయం అవుతుంది అని కష్టపడకుండా మన లైఫ్ స్టైల్ ఏది మారదని అన్నారు. విద్యార్థులకు ప్రథమ గురువు తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా సాధన చేయాలని, చదువు జ్ఞానాన్ని పెంచుతుంది విలువను ఇస్తుంది కావున 30 సంవత్సరాల లోపు విద్యార్థుల భవిష్యత్తును సుఖమయ జీవితముగా మలుచుకోవాలని అన్నారు. విద్యార్థులు మత్తు మారకద్రవ్యాల మీద దృష్టి పెట్టకుండా, మైనరు విద్యార్థులు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఓరుగంటి వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ తొట్టెంపూడి సుబ్బారావు, మస్తాన్వలి, శిరీష, ఉష, శాలిమ,సీతారావమ్మ, శివకుమారి,బాబురావు, హజరత్ అయ్యా,కట్ట సుబ్బారావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు