లింగసముద్రంలో ఇది మంచి ప్రభుత్వం
BSBNEWS - LIMGASAMUDRAM [25.09.2024]
లింగసముద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ఇంటింటికి తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ 100 రోజుల పాలనలో 100కు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని, నాయకుల్లాగా కాకుండా సేవకుల్లాగా పని చేస్తాం కాబట్టే ఇది మంచి ప్రభుత్వం అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో దారుణ పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలిగే సత్తా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకి కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని ఆయన తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంగల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతున్నారని గుర్తుచేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజల కోసం దాదాపు 10 రోజుల పాటు దగ్గరుండి వారికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి నారా చంద్ర బాబు నాయుడు అని అన్నారు. అవ్వ తాతలకు పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఒకేరోజు 65 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,400 కోట్లు పంపిణీ చేసి దేశంలోనే తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్ ను పునః నిర్మాణం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించమన్నారు. మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందన్నారు.ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అని, వెనక్కి వెళ్లిన కంపెనీలన్నీ తిరిగి వస్తాయన్నారు. లింగసముద్రం మండలంలో గత ఐదేళ్లలో రాక్షస పాలన కొనసాగిందని, తెలుగుదేశం పార్టీ నాయకులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయన అన్నారు. మండలంలో టిడిపి కార్యకర్త మిరపతోటను ధ్వంసం చేస్తే, కనీసం కేసు కట్టలేదని అన్నారు. కానీ తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడతామని తెలిపారు. 24 గంటల పాటు ప్రజల మధ్యలోనే ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తానని, రాబోయే ఐదేళ్లలో గ్రామాల్లో 100% సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా వేదికలో 14 డ్వాక్రా సంఘాలకు 2.48 కోట్ల రుణాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తర్వాత మొక్కలు నాటారు. లింగసముద్రం వెళుతున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి వెంగళాపురం గ్రామం దగ్గరే టిడిపి, జనసేన, బిజెపి నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చి లింగసముద్రం వరకు ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపిస్తూ, గుర్రంపై ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహసిల్దార్ సీతామహాలక్ష్మి, మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాల్ రావు, మాజీ ఎంపీపీ గూడూరి కల్పన, గ్రామ టిడిపి అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, మండల తెలుగు యువత అధ్యక్షుడు అడపా రంగయ్య, సర్పంచ్ పులి పెదరాఘవులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొణిదల శ్రీనివాసులు, మండలంలోని వివిధ గ్రామాల నాయకులు హాజరయ్యారు.