కందుకూరులో కానరాని ప్రతిపక్షం
దూసుకుపోతున్న ఇంటూరి నాగేశ్వరరావ
మహీధరుడు వైపు చూస్తున్న వైసిపి కార్యకర్తలు
BSBNEWS - అధినేత (యర్రంశెట్టి ఆనంద మోహన్)
BSBNEWS - KANDUKUR [27/09/24]
కందుకూరులో రాజకీయం మలుపులు తిరుగుతుంది. ప్రతిపక్ష హోదా లేకుండా టిడిపి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 2024వ సంవత్సరంలో టిడిపి గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అప్పటినుండి కందుకూరులో వైసిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ వెనకంజులో ఉన్నాడని వైసీపీ కార్యకర్తలు నుండి విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ కార్యకర్తలను ఎప్పటికప్పుడు అంటిపెట్టుకొని వారి సమస్యలను పరిష్కరించే దిశగా నాయకుడు ఉండాలని అలా కాకుండా పార్ట్ టైం జాబ్ లాగా అప్పుడప్పుడు కందుకూరులో తలుక్కుమని మెరుస్తూ బుర్ర మధుసూదన్ యాదవ్ వచ్చి పోతున్నాడే తప్ప కార్యకర్తల సమస్యల పరిష్కారంలో చొరవ చూపటం లేదని వైసిపి కార్యకర్తలు తో పాటు వైసిపి ముఖ్య నేతలు సైతం చెబుతున్నారు. ఇటీవల మండలంలోని ఓగూరులో జరిగిన ఓ సంఘటనలో కనీసం మీకు మేమున్నాం అనే భరోసాను కూడా కల్పించడంలో బుర్ర మధుసూదన్ యాదవ్ విఫలమయ్యాడని వైసీపీ వర్గీయులు తెలుపుతున్నారు. ఒకపక్క కందుకూరులో రాజకీయ అగ్రగామి స్థానంలో ఉన్న మానుగుంట మహీధర రెడ్డి తను 2024 ఎన్నికల బరిలో లేకపోయినా సరే ఆరుపదుల వయసులను లెక్కచేయకుండా కార్యకర్తల కోసం ప్రతినిత్యం తమ కార్యాలయానికి వస్తూ కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే 2024 ఎన్నికలలో జరిగిన కొన్ని పరిణామాల వలన మానుగుంట మహీధర్ రెడ్డి వైసిపి పై అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది. అయినా సరే తనను నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తను వదిలిపెట్టకుండా నేనున్నాను మీకు అంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ బుర్ర మధుసూదన్ యాదవ్ మాత్రం 2024 ఎన్నికల్లో తన ఓటమికి వైసీపీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలే కారణం అంటూ అసహనంలో ఉన్నాడని కందుకూరు వైసీపీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారి పరిస్థితి అలా ఉంటే 2024లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం ఎప్పటికప్పుడు తన కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తూ కందుకూరులో ఇంటూరి మార్పు కనపడేలా పనిచేస్తున్నాడని ప్రజల నుండి అభినందనలు వెళ్లివెత్తుతున్నాయి. ఇంటూరి కి బ్రేక్ వేయాలంటే కందుకూరులో మహిధరుడు వల్లే సాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మానుగుంట మహీధర రెడ్డి కందుకూరులో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆయన ఏ దారి వైపు నడుస్తాడో అన్న సందేహాలు వైసిపి కార్యకర్తలతో పాటు కందుకూరు ప్రజలలో బలంగా వినిపిస్తుంది. ఇటీవల ప్రకాశం జిల్లా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి జనసేన తీర్థం పుర్చుకున్నారు. ఆ సందర్భంలో పలువురు వైసిపి ఎమ్మెల్యే లు కందుకూరులో మానుగుంట మహీదర్ రెడ్డి కార్యాలయం వద్దకు వచ్చి మహిదర్ రెడ్డితో పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. అటువంటి సందర్భంలో కందుకూరులో రాజకీయం మారనుందా అన్న వాతావరణం కనబడుతుంది. వైసీపీలో మాత్రం వైసీపీ ముఖ్య నేతలు సైతం బుర్రాకు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే ఉంటే వైసీపీ కార్యకర్తలు సైతం ఏదో ఒక పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు కందుకూరు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వైసిపి అధిష్టానం కల్పించుకొని కందుకూరులో వైసిపి పరిస్థితిని మార్చి తమ కార్యకర్తలకు ఎటువంటి న్యాయం, భరోసా కలిగిస్తుందో వేచి చూడాల్సిందే.