సమస్యల పరిష్కారంకై సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్ష ప్రతినిధుల బృందం
BSBNEWS - KANDUKUR
కందుకూరు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు శనివారం అఖిలపక్ష ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలి అని, చుక్కల భూముల సమస్య పరిష్కరించాలని, రాళ్లపాడు ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని,మద్యం అధిక ధరలను నియంత్రించాలి అని కోరారు.కందుకూరు నియోజకవర్గంలో గడిచిన రెండు సంవత్సరాలుగా చుక్కల భూముల సమస్య రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంది అని వివరించారు. ముఖ్యంగా రైతులు మానసిక ఆవేదన చెందుతున్నారని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్ లేక రైతులు కనీస అవసరాలు, అప్పులు తీర్చుకునేందుకు, అవకాశం లేక నిరంతరం మానసిక ఆవేదన చెందుతున్నారు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం గత సంవత్సరం 11వ నెలలో జీవో ఇచ్చిన నూతన ప్రభుత్వం వచ్చినా ఈనాటికి చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కాలేదు అని, సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. మరోవైపు కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని, నియోజకవర్గంలో మన్నేరు నది వలనే భూగర్భ జలాలు నిలవ ఉంటూ, కరువు కాలంలో మెట్ట ఫైర్లు వేసుకొని పాడి పరిశ్రమతో పల్లెల్లోని అన్ని వర్గాల ప్రజలు జీవనం పొందుతున్నారు అని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు వలన రాళ్లపాడు ప్రాజెక్టుకు సక్రమంగా నీరు చేరలేదు అని, ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఇసుక తరలింపుకు ఎలాంటి ఇసుక రేవులు లేవు అయినా రాత్రి పగలు తేడా లేకుండా రోజుకి వందల సంఖ్యలో వాహనాలతో అక్రమంగా ఇసుక తరలించడం వలన భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది అని వివరించారు. వందల మీటర్లు బోర్లు వేసిన నీరు లభించని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు. రాళ్లపాడు ప్రాజెక్టు లో చేపల పెంపకం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రాజెక్టు నిర్దేశకాలకు అనుగుణంగా ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరారు. రాళ్లపాడు ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలి అని కోరారు. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన సమయంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని, అలాంటి దోపిడీని అరికట్టాలి అని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన సబ్ కలెక్టర్ తన పరిధిలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాల కొండయ్య, సిపిఎం డివిజన్ నాయకులు జి వెంకటేశ్వర్లు, రాళ్లపాడు రైతు సంఘం నాయకులు కాకుమాను మాధవరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి. సురేష్ బాబు, హుస్సేన్, వైసీపీ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.