సన్న చిన్నకారు రైతులకు 90% డ్రిప్పు పైపులు రాయితీ
వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్
BSBNEWS - వలేటివారిపాలెం
స్థానిక రైతు సేవ కేంద్రం నందు రైతులకు వ్యవసాయ ఉద్యానవన సహాయకులు సూక్ష్మ నీటి సేద్యం గురించి అవగాహన సదస్సును మండల వ్యవసాయ అధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కొరకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు రాయితీపైన అందిస్తుందని 5 ఎకరాల లోపు రైతులకు డ్రిప్ 90% రాయితీ ద్వారా ఒక రైతుకు గరిష్టంగా 2,18,000/- రూపాయలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఐదు ఎకరాల నుండి పది ఎకరాలు లోపు గల రైతులకు 70% రాయితీపైన 3,46,000/- రూపాయలు గరిష్టంగా ఇస్తున్నారన్నారు. స్ప్రింకులర్లు విషయమై ఐదు ఎకరాల లోపు రైతులకు 55% రాయితీ ద్వారా 30 పైపులు, ఐదు స్ప్రింక్లర్లు లేదా 41 పైపులు 9 స్ప్రింక్లర్లు అందిస్తున్నట్లు తెలిపారు. రాయతీ పొందు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రం నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కావలసిన డాక్యుమెంట్స్ 1బీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, ఫీల్డ్ మ్యాప్ తీసుకొని రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ, ఉద్యానవన సహాయకుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. శాఖవరం, వలేటివారిపాలెం గ్రామాలలో మహేంద్ర ఈపీసీ కంపెనీ ద్వారా రైతులకు ప్రభుత్వ రాయితీతో అందించబడిన స్ప్రింక్లర్లు తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు నరేష్, మహేంద్ర ఈపీసీ కంపెనీ ప్రతినిధులు శ్రీహరి, అన్ని గ్రామ రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.