దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది
రావుల వెంకయ్య
BSBNEWS - KANDUKUR
దేశ భవిష్యత్తు కేవలం యువత పై ఆధారపడి ఉందని యువత రోలోభాలకు లోబడకుండా వారి జీవన ప్రయాణం ఏమిటో తెలుసుకొని ముందుకు సాగాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య అన్నారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ సమావేశం ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు చేవూరు దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావుల వెంకయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్న సందర్భంలో అమిత్ షా అతనిని తక్కువ చేసి మాట్లాడి చాలా తప్పు చేశాడని దానిని క్షమించరాని చర్యగా పరిగణలోకి తీసుకోబడుతుందని ఆయన అన్నారు. యువతను పక్కదారి పట్టించుకోములో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ముందంజలో ఉంటున్నాయని వారి మాటను, వారు పెట్టే ప్రలోభాలకు ఎవరు లొంగకుండా నిజ నిజాలు తెలుసుకొని యువతరం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వంలో యువతకు అనేక నష్టం కలిగిందని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయ మాటలు చెప్పి బిజెపి ప్రభుత్వం దాదాపు 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చిందని అయినా యువతకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలనే తీసేసే ప్రయత్నాలు తీవ్రతరం చేసిందని వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం దేశంలో యువతరానికి ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఉన్న ఉద్యోగస్తులకు వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా వారిని అనేక ఇబ్బందులు పెడుతున్నారని యువత అంటే కేవలం వారి ఎన్నికల ప్రచారానికి వాళ్ల గెలుపుకు నాందిగా చూస్తున్నారే తప్ప వారి బాగోగులు చూడటం లేదని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో యువత పాత్ర చాలా కీలకంగా ఉందని భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో పోరాట యోధులు యువతరంలోనే తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి దేశ స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారని గుర్తు చేశారు. అటువంటి దేశంలో ప్రస్తుత పాలకుల చేతిలో యువతరం నలిగిపోకుండా ముందుకు తీసుకుపోతున్న ఏకైక సంఘం అఖిలభారత యువజన సమాఖ్య అని ఆయన అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో అఖిలభారత యువజన సమాఖ్య ఎంతో కీలకపాత్ర పోషించి ఎన్నో పోరాటాల ద్వారా యువతరానికి అనేక ఉద్యోగ అవకాశాలు తోపాటు మేలు చేసిన ఘనత అఖిలభారత యువజన సమాఖ్య సాధించిన గొప్ప చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్, ఏఐవైఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు చేవూరి దుర్గాప్రసాద్, బొజ్జ చంద్రమోహన్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.