మీ మీద మీకుటుంబం ఆధారపడి ఉంది.
- కందుకూరు ఆర్టీవో టి.వి.ఎన్ లక్ష్మీ
BSBNEWS - కందుకూరు
మీ మీద మీకుటుంబం ఆధారపడి ఉంటుందని, మీ నిర్లక్ష్యంతో కుటుంబాన్ని రోడ్డున పడ వేయ్యద్దని, మీ నిర్లక్ష్యమే యముడికి ఆయుధం అని, ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా వాహనాలు నడపాలని కందుకూరు ఆర్టీవో టి.వి.ఎన్ లక్ష్మీ స్కూలు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. పట్టణ పరిధిలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయములో శుక్రవారం పట్టణంలోని అన్ని స్కూల్, కాలేజీలకు సంబంధించిన బస్సు డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై కందుకూరు ఆర్టీవో టి.వి.ఎన్ లక్ష్మీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టి వి ఎన్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఒక్క స్కూల్ బస్ డ్రైవర్, ఆటో డ్రైవరు రోడ్ సేఫ్టీ రూల్స్ ను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ముఖ్యంగా స్కూల్ బస్సు డ్రైవర్లు వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు చుట్టుపక్కల చూసి జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్లాలని తెలిపారు. అతివేగంగా వెళ్లకూడదని, సెల్ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని తెలియజేశారు. 60 సంవత్సరములు దాటిన డ్రైవర్ సోదరులు స్వచ్ఛందంగా స్కూల్ బస్సులు నడుపుకుండా ఉండాలని కోరారు. మోటార్ వాహనముల తనిఖీ అధికారి చెన్నూరి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు. స్కూల్ బస్సు నడుపు డ్రైవర్లు బస్సులో తనతో పాటు అటెండెంట్ ఉండి స్కూల్ పిల్లలు వాహనము ఎక్కినప్పుడు, దిగునప్పుడు ముందు వెనక గమనిస్తూ ఎవరూ లేరని గమనించుకున్న తర్వాత వాహనమును ముందుకు వెళ్లేలా చూసుకోవాలని తెలియజేశారు. స్కూల్ బస్సు నడుపు డ్రైవర్లు యూనిఫామ్ కూడా ధరించి డ్రైవ్ చేయాలని, స్కూల్ పిల్లలు తీసుకొని వచ్చి మరల తిరిగి వారి యొక్క గమ్యస్థానమునకు చేర్చు బాధ్యత వహిస్తున్నారు అలాంటి సందర్భంలో వారిని సురక్షితంగా తీసుకొని పోవాల్సిన బాధ్యత మీపై ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఎవరైతే బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపిన అట్టి వారిపై చర్యలు తీసుకోబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఓ కార్యాలయ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.