నేకునాంపురం, సింగమనేనిపల్లి లో పొలం పిలుస్తుంది
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని నేకునంపురం, సింగంనేనిపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులందరూ కూడా తప్పనిసరిగా రబీలో సాగు చేసిన పంటలన్నీ ఈ పంట నమోదు చేసుకోవలసినదిగా తెలిపారు. ఈనెల 31వ తారీకు వరకు వరి పంట బీమా కట్టుకొనుటకు చివరి తేదీ అని తెలియజేశారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా శనగ, నువ్వులు పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం అధిక విస్తీర్ణంలో పొగాకు పంట సాగు చేసి ఉన్నారని, రైతులందరూ కూడా పొగాకు పంట సాగు తగ్గించి అపరాల పంటలు నూనె గింజలు సాగు చేసుకోవాలని తెలిపారు. అనంతరం పొలాలను సందర్శించి మినుము, పొగాకు పంటలను పరిశీలించారు. ప్రస్తుతం మినుము పంట పిందె, ఎండు కాయ దశలో ఉంది అని, ప్రస్తుతం చలి వాతావరణం వలన బూడిద తెగులు రాకుండా మైక్రో బుటానిల్ 1.0 గ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా అమిస్టర్ టాప్ 0.5 మి. లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. పల్లాకు తెగులు నివారణకు తెల్ల దోమ మందు అసెటమి ప్రైడ్ లేదా థయో మేథోజైమ్ 0.2 గ్రామ్ మరియు వేప నూనె 5 మి. లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని అన్నారు. ఆకు మచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్ 2.5గ్రామ్, సాఫ్ 2.5 గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. అగ్రోమిన్ మాక్స 2.5 గ్రామ్, 19:19:19 లేదా 13:0:45 పొడి ఎరువు 5గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. పొగాకు పొలం నాటు నుండి ఎదుగుదల దశలో ఉందన్నారు. వర్షాల కారణంగా వేరు కుళ్ళు తెగులు ఆశించిన పొలాల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 2.0గ్రాములు లీటర్ నీటికి, ప్లాంటోమైసిన్ 1గ్రామ్ లీటర్ నీటికి కలిపి మొక్కల వేరు భాగంలో పోయాలని, తోటలు పాలిపోయినట్లు అయితే 13:0:45 ఒక కేజి ఎకరానికి పిచికారి చేయాలి అని, వర్షాలు ఆగిన తర్వాత పొటాషియం సల్ఫేటు 1కేజి ఎకరానికి చొప్పున రెండు సార్లు పిచికారి చేయాలి అని తెలియజేసారు. ఈకార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వై. ప్రభు, అత్తోట వెంకటేశ్వర్లు, చిడుపోతు రామానాయుడు, కాపులూరి మాలకొండయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.