అభివృద్దే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం.
అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - వలేటివారిపాలెం
అభివృద్దే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అధికారులందరూ పనిచేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని దానికి తగ్గట్లుగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ వారంలో ఒకరోజు ఒక పంచాయతీ లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేశారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీల మౌలిక వసతుల కొరకు నిధులు విడుదల చేశారని, ప్రభుత్వం వచ్చిన 8 నెలలోనే నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయల సి.సి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, మరల విడతలో సుమారు 9 కోట్ల రూపాయల బి.టి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల మంజూరయ్యాయని తెలియజేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ద్వారా మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకోగలమని ఆయన సూచించారు. సౌర పవన విద్యుత్ కు కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సౌర పవన విద్యుత్ వల్ల ప్రజలకు భారం తగ్గుతుందని, భవిష్యత్తులో కరెంట్ బిల్లు కట్టే భారం ఉండదని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు కింద మండలంలో మా సొంత గ్రామం అయిన బడేవారిపాలెం ను మోడల్ గ్రామంగా తీసుకున్నారని తెలియజేశారు. సర్వసభ్య సమావేశానికి చేసిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక, జడ్పిటిసి ఇంటూరి భారతి, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, ఇతర పార్టీ నాయకులు అన్ని గ్రామాల పంచాయతీ సెక్రెటరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.