జి మేకపాడులో పొలం పిలుస్తోంది
BSBNEWS - కందుకూరు
మండలంలో జి మేకపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వి రాము మాట్లాడుతూ రైతులు ఎక్కువగా పొగాకు సాగు మీద మొగ్గు చూపుతున్నారని, పొగాకు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు అయిన శనగ, నువ్వు, మినుము, పెసర, ధనియాలు ఇతర పంటలు వేసుకోవాలని అన్నారు. ఒక పంటలో నష్టం వస్తే వేరే పంటలో ఆదాయం తీసుకోవచ్చని తెలిపారు. రబీ సీజన్లో వేసిన అన్ని పంటలకు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని కోరారు. వరి పంట కు ఈ నెల జనవరి 15 లోపు ఒక ఎకరానికి రూ 168 చొప్పున భీమా చేయించుకోవాలని తెలిపారు. తదుపరి పూత పిందె దశలో వున్న కంది పంటను పరిశీలించారు. కందిలో పూత పిందె రాలకుండా, బాగా పూత పూయుటకు ప్రతి 10రోజులకు ఒక సారి 19:19:19, అగ్రో మాక్స్ ఒక ఎకరానికి ఒక కేజీ పిచికారీ చేయాలి అని అన్నారు. మారుకా మచ్చల పురుగు రాకుండా నోవాలురాన్ లేదా ఇండాక్స్ కార్బ 200 మి.లీ ఒక ఎకరానికి కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. శనగ పచ్చ పురుగు నివారణకు ఒక ఎకరానికి 4చొప్పున లింగాకర్షక బట్టలు, ఎకారానికి 20 పంగాల కర్రలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అవసరాన్ని బట్టి ప్రొఫెనోఫోస్ 2.0 మి.లీలో ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. కోవూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్ సుధాకర్ మాట్లాడుతూ ఉపాధిహోమీ పథకం ద్వారా పశు గ్రాసం పెంచుకొనే సన్న, చిన్న కారు రైతులకు అర ఎకరలోపు వున్నవారికి రూ 33000/లు సబ్సిడీ వుందనీ, దాణా ఖర్చుల నిమిత్తం కిసాన్ క్రెడిట్ కార్డు వున్న వారికి బ్యాంకులో తక్కువ వడ్డీతో ఋణాలు తీసుకోవచ్చునని తెలియజేసారు. జి.మేకపాడు సర్పంచ్ గూడపాటి. బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా మేరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్ రోగాల బారి నుండి కాపాడుకోవాలంటే పొగాకు సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలియజేసారు. ఈకార్యక్రమంలో జి.మేకపాడు గ్రామ వ్యవసాయ సహాయకులు టీ.రోసి రెడ్డి, పశు సంవర్థక సహాయకారి సి హెచ్.ప్రసాదు, గ్రామ పెద్ద లక్కిరెడ్డి.సుబ్బారెడ్డి,రైతులు పాల్గొన్నారు.