కోవూరు, పందలపాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది
BSBNEWS - కందుకూరుమండలంలోని కోవూరు, పందలపాడు గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ రైతులు ఎక్కువగా పొగాకు సాగు మీద మొగ్గు చూపుతున్నారు అని, పొగాకు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు అయిన శనగ, నువ్వు, పెసర, ధనియాలు ఇతర పంటలు వేసుకోవాలని, ఒక పంటలో నష్టం వస్తే వేరే పంటలో ఆదాయం తీసుకోవచ్చని తెలిపారు. రబీ సీజన్లో వేసిన అన్ని పంటలకు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని కోరారు. వరి పంటకు ఈ నెల జనవరి 15 లోపు ఒక ఎకరానికి రూ 168 చొప్పున భీమా చేయించుకోవాలని తెలిపారు. తదుపరి వరి పంట పొలాలను పరిశీలించి వరిలో ఆకుముడత నివారణకు కార్తాప్ హైడ్రో క్లోరైడ్ 2.0 లేదా మార్షల్ 2.0 మి. లీ ఒక లీటరు నీటికి లేదా ఇండాక్స్ కార్బ్ 200 మి . లీ ఒక ఎకరానికి కలిపి పిచికారి చేయాలి చేసి నివారించు కోవచ్చని తెలిపారు. పందలపాడు గ్రామంలో ఎన్ ఎల్ ఆర్ 33892 రకం వరి పొట్ట మీద, వెన్ను దశలో ఉంది అని, పాము పొడ ఆశిస్తుంది అని, దీని నివారణకు ప్రోపికొనజోల్ 2.0మీ.లి ఒక లీటరు నీటికి లేదా వాలిడా మైసిన్ 400 మీ. లీ ఒక ఎకరానికి కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. యూరియాను సిఫారసు కు మించి వాడకూడదని, మార్కెట్ లో నానో యూరియా, నానో డి ఎ పి అందుబాటులొ పై పాటుగా పిచికారీ గా వాడుకోవచ్చని తెలియజేసారు. కోవూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్ సుధాకర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం ద్వారా పశు గ్రాసం పెంచుకొనే సన్న, చిన్న కారు రైతులకు అర ఎకరలోపు వున్నవారికి రూ 33000/ సబ్సిడీ వుందని, అలాగే దాణా ఖర్చుల నిమిత్తం కిసాన్ క్రెడిట్ కార్డు వున్న వారికి బ్యాంక్ లో తక్కువ వడ్డీతో రుణాలు తీసుకోవచునని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ మోడల్ మేకర్ పి మాధవ మాట్లాడుతూ ప్రతి రైతు కిచెన్ గార్డెన్ వేసుకోవాలని, ప్రకృతి వ్యవసాయంలో ఏటిఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ గురించి సేంద్రీయ డి ఎ పి,సేంద్రీయ పొటాష్ గురించి వివరించారు. అనంతరం అనంతసాగరం గ్రామంలో మినుము పంటలో కందుకూరు సహయ గణాంక అధికారి కె .కృష్ణవేణి సమక్షంలో పంట కోత ప్రయోగాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో మార్కెటింగు శాఖ నుండి బి.ప్రవీణ్, కోవూరు, పండలపాడు గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం.నాగరాజు, జి.రోజీ పశు సంవర్థక సహాయకారి వి.వేణు, రెండు గ్రామాల పెద్దలు నాదెండ్ల వెంకట రమణయ్య, కంజుల రామచంద్రా రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.