టి.ఆర్.ఆర్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కలగట్ల హజరత్తయ్య ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి మాట్లాడుతూ ఓటు యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. తలరాతను మార్చేది ఓటు అని, ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు ఎవరి తలరాతనైనా మార్చగలరని, డబ్బుకు ఆశపడకుండా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించగలరని, ఈ వయసు నుంచి ఓటు విలువ తెలుసుకొని మీ గ్రామంలో మీ పెద్దవారికి ఓటు విలువని తెలియజేసి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించగలరని తెలిపారు. కళాశాల పౌరశాస్త్ర అధ్యాపకులు ఓరుగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1952 సంవత్సరంలో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి వయోజన ఓటు హక్కును అమలు చేయడం జరుగుతుందని, ఈ ఓటర్ల యొక్క విధివిధానాలు ఎన్నికల సంఘానికి సంబంధించి కేంద్రం రాష్ట్రంలో ఆ సంఘాలు బాగా పనిచేసే మంచి గుర్తింపును తీసుకొస్తాయని తెలియజేశారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ కె హజరత్తయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన విద్యార్థులందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ నమోదు చేయించుకోవాలని, పదవ తరగతి సర్టిఫికెట్ తో మీ సమీపంలోని బూతు లెవల్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేయించుకున్న 15 రోజుల తర్వాత మీ స్టేటస్ తెలుస్తుందని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. విద్యార్థులందరిచే ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞను చేయించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.