పట్టణ ప్రజల పరిశుభ్రతకు ప్రాధాన్యత
నీటి కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించటమే ధ్యేయం
.19.40 కోట్ల రూపాయలతో 9.6 ఎం ఎల్ డి మురుగు నీటి శుద్ధి కర్మాగార శంకుస్థాపన
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
పట్టణ ప్రజలకు పరిశుభ్రతకు, పట్టణంలో నీటి కాలుష్యం నివారించి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణమును అందించటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు పురపాలక సంఘం పరిధిలో 19.40 కోట్ల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో మురుగు నీటిని శుద్ధి చేసే 9.6 ఎం ఎల్ డి సామర్థ్యంతో నూతనంగా నిర్మిస్తున్న శుద్ధి కర్మాగార కేంద్రానికి గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం దీటైన చర్యలు చేపట్టిందని దానిలో భాగంగానే మురుగునీటి శుద్ధి కేంద్రం కర్మాగారాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు..పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మురుగునీటి శుద్ధి చేయడం అత్యంత అవసరమని కందుకూరు మున్సిపాలిటీ రానున్న కాలంలో ఒక క్లీన్ మున్సిపాలిటీగా మార్చేలా అన్ని చర్యలు తీసుకుంటామని మురుగు నీటిపారుదల సమస్యను తగ్గించేందుకు ఈ శుద్ధికర్మాగారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా అక్కడున్న అధికారులు ఈ శుద్ధి కర్మాగారంలో మురుగు నీటిని శుద్ధి చేసే ప్రక్రియను అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే అనూష, మున్సిపల్ డి.ఈ గణపతి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, వడ్డేవల్లి వెంకట్రావు, దివి మాధవరావు, నల్లూరి వీరరాఘవులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.