ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
BSBNEWS - KANDUKUR
ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించాలని కందుకూరు జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాIIయస్ రజని కందుకూరు డివిజన్ వైద్యాధికారులకు సూచించారు. నూతనంగా పదోన్నతిపై కందుకూరు జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కందుకూరు డివిజన్ లోని వైద్యాధికారులతో బుధవారం పట్టణంలోని తూర్పు వడ్డేపాలెం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవనములో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో వున్న అన్ని రకాల వైద్యసేవలను తప్పనిసరిగా అందించాలని ఆమె తెలియజేశారు. అనంతరం వైద్యాధికారులందరూ కలిసి కందుకూరు జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో కందుకూరు డివిజన్ లో ఉన్న కరేడు, చాకిచర్ల, గుడ్లూరు, మాచవరం, వలేటివారిపాలెం, లింగసముద్రం, కొండాపురం, వరికుంటపాడు, తాలూకా ఆఫీస్, తూర్పు వడ్డేపాలెం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు హాజరైనారు.