విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి
తిక్కవరపు రామిరెడ్డి జూనియర్ కళాశాల 29వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - KANDUKUR
ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అన్ని వసతులు ఉన్నాయని విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 29వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు కళాశాల వార్షికోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. కళాశాల ప్రాంగణంలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఇదే కళాశాలలో నేను చదువుకున్నానని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని దానిలో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేసి విద్యార్థులకు రుచికరమైన భోజనం సదుపాయం కల్పించారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారని వారి ఆశలు నిరాశ చేయకుండా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో మంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని విద్యార్థులకు ఎటువంటి అనుమానాలు ఉన్న వెంటనే అధ్యాపకులకు తెలియజేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంసెట్ లలో మంచి ర్యాంకులు సాధించి వివిధ హోదాలలో ఉన్నారని మీరు కూడా బాగా చదివి మంచి ఉద్యోగాలు పొంది కందుకూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి, మౌలిక వసతులకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలియజేశారు. కళాశాలలో బాగా చదువుకొని మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం అందించడం జరిగింది. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, ముచ్చు శ్రీనివాసరావు, వడ్డెళ్ళ రవిచంద్ర షేక్ రఫీ, కూనం నరేంద్ర, షేక్ సలాం మరియు ఇతర పార్టీ నాయకులు, కాలేజీ అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.