నీటిలో ఉపాధి కష్టాలు
ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉన్నట్టా... లేనట్టా...
BSBNEWS - ఉలవపాడు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమంది అధికారులకు, నాయకులకు వరంగా మారింది. ఉపాధి కూలీలకు మాత్రం శాపంగా మారింది. అందుకు ఉదాహరణగా ఉలవపాడు మండలంలోని మన్నేటికోటలో జరుగుతున్న ఉపాధి పనులే అని చెప్పవచ్చు. మంగళవారం ఉపాధి కూలీలు లోతైన నీళ్లను దాటి మస్టర్ పాయింట్ కి వస్తున్న దృశ్యం కనిపించింది. వాస్తవానికి కుంటలు, చెరువులు వంటి వాటి వద్ద ఉపాధి పనులు నిర్వహించి వర్షాకాలం నాటికి వర్షాలు కురిస్తే వర్షం నీటిని నిల్వ ఉంచేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న పని ప్రదేశాన్ని చూస్తే ఉపాధి కూలీలకు వచ్చే వేతనం ఏ విధంగా కొలతలు వేసి ఇస్తారా అన్న ప్రశ్నగా ఉంది. ఉపాధి కూలీలు పని చేసే చోటకు ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్లకుండా వారినే నేరుగా లోతైన నీటి నుండి దాటుకొని మస్టర్ పాయింట్ కి రావాలని ఆర్డర్ వేయటంతో అక్కడ పని ఏ విధంగా జరుగుతుందో అనే విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం మాత్రం వారికి ఇవ్వాల్సిన ప్రధమ చికిత్స కిడ్స్ సైతం ఇవ్వకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగితే మా పరిస్థితి ఏందంటూ ఉపాధి కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కూలీలకు అవసరమైన కనీస వసతులు సైతం కల్పించకపోవడం పట్ల పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా పని చేస్తున్నారా లేదా అని పలువురు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఉలవపాడు ఏపీఓను వివరణ కోరగా వచ్చేవారం పనిని మారుస్తామని చెప్పడం విశేషం.