ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి విద్యుత్ షాక్
BSBNEWS - లింగసముద్రం
లింగసముద్రం ఎస్సీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న పల్లెపాటి సందీప్ హాస్టల్ వద్ద ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ తగిలిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. విద్యుత్ షాక్ కి గురైన సందీప్ ని కుటుంబ సభ్యులు కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వెళ్ళమని వైద్యులు సూచించారు. దాంతో కందుకూరులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఈ సంఘటన జరిగిందని దానికి ఉన్నత అధికారులు బాధ్యత తీసుకొని విద్యార్థికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ కుమారుడికి విద్యుత్ షాక్ తగిలి ప్రాణం మీదకు వచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు కందుకూరు సబ్ కలెక్టర్ ను సోమవారం ఆశ్రయించినట్లు సమాచారం. ఆ ఎస్సీ హాస్టల్ కు ఉన్న వార్డెన్ కు ఆరోగ్య నిమిత్తం సెలవులో ఉన్నాడు. దాంతో మరొకరిని హాస్టల్ కి ఇన్చార్జిగా నియమించడం జరిగింది. కానీ ఆ హాస్టల్ కు ఇంచార్జ్ గా వెళ్లడం ఆ వార్డెన్ కు ఇష్టంలేని కారణంగా ఆ హాస్టల్ ను పట్టించుకోవడంలేదని సమాచారం. నిరుపేద విద్యార్థుల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న కొంతమంది నిర్లక్ష్యం వలన విద్యార్థుల చదువులతో పాటు వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జరిగిన సంఘటనపై విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.జరిగిన సంఘటనపై ఏ ఎస్ డబ్ల్యూ ను వివరణ అడిగేందుకు తన కార్యాలయానికి వెళ్ళగా కార్యాలయానికి తాళం వేసి ఉండటం గమనార్హం. ఫోన్ లో వివరణ అడిగేందుకు ప్రయత్నించినా అధికారి మౌనవహించడం విశేషం.