పొగాకు, మిర్చి, వరి పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి
BSBNEWS - వలేటివారిపాలెం
పొగాకు, మిర్చి, వరి పంటలకు కనీస మద్దతు ధరను చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వలేటివారిపాలెం మండల తహసిల్దార్ అబ్దుల్ అహ్మద్ కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగాఏ.పీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాదాల రమణయ్య, సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ లు మాట్లాడుతూ అననుకూల వాతావరణ పరిస్థితుల వలన రైతాంగం అదనపు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పంట వేయటానికి అదనపు ఖర్చులు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది పొగాకు కు క్వింటాల్ కు సగటున 30వేలు చెల్లించాలని, మిరప కు క్వింటాల్ కు 20వేలు ఇవ్వాలని, వరి పంటకు గ్రేడ్లతో నిమిత్తం లేకుండా పుట్టింటికి రూ.19500 లు చెల్లించాలని తహశీల్దార్ ను కోరారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక వర్షాలు అననుకూల వాతావరణ పరిస్థితులు దృష్ట్యా పంటల దిగుబడి బాగా తగ్గిపోయిందని, పెట్టుబడి ఖర్చు రైతులకు పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల మన ప్రాంత రైతాంగం నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, పంటలకు కనీసం మద్దతు ధరను ప్రకటించాలని కోరారు. వ్యవసాయ రంగంలో పంటల గిట్టుబాటు ధరల విషయంలో స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో దార్ల మాధవరావు, మానికొండ రమణయ్య, సన్నె బోయిన.చిరంజీవి, బి కుమార్ రెడ్డి, పిల్లి రామచంద్రారెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.