ఆ తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి
అగ్రిగోల్డ్ బాధితులపై దాడి హేయమైన చర్య
BSBNEWS - కందుకూరు
అగ్రిగోల్డ్ ఆస్తులు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వరికుంటపాడు మండల తాహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి అని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో అగ్రిగోల్డ్ సంబంధించిన భూములలో ఎర్రచందనం, జామాయిలు ఉన్నాయని వాటిని కొంతమంది అక్రమార్కులు చెట్లను నరికి అమ్ముకుంటున్నారని ఇది తెలిసిన రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. సిఐడి కేసు దర్యాప్తులో ఉండగా అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొడుతున్న దొంగల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న వైఖరి దొంగలతో అధికారులు కుమ్మక్కైనట్టు తెలుస్తుందని వారు ఆరోపించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ వరుకుంటపాడు మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం, జామాయిల్ చెట్లు నరుకుతుంటే పరిశీలించడానికి పోయిన మా మీద అక్కడ చెట్లు నరికి అమ్ముతున్న వారు మాపై దాడి చేసి మమ్మల్ని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి మీ అంత తెలుస్తామంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వచ్చి వారిని పేరుపేరునా పిలిచి వెళ్ళండి గొడవ వద్దంటూ వారికి సర్ది చెప్పి పంపించాడని, వారిపై ఇప్పటికి కేసు కట్టలేదని ఇందులో ఎస్సై కి కూడా వాటా ఉన్నట్టు తెలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. మాలకొండయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 24వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని నిరసన కార్యక్రమం జరుగుతుందని అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు, అగ్రిగోల్డ్ అసోసియేషన్ కందుకూరు అధ్యక్షులు బోయపాటి శ్రీను, దుర్గాప్రసాద్, మాధవరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, భాష తదితరులు పాల్గొన్నారు.