బడ్జెట్ కాపీలు దహనం

bsbnews
0

 బడ్జెట్ కాపీలు దహనం 

BSBNEWS - సింగరాయకొండ

2025-26 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కార్మిక రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన సింగరాయకొండలో 2025 - 26 కేంద్ర బడ్జెట్ లో రైతాంగానికి, కార్మిక వర్గానికి కేటాయింపులు తక్కువగా చేసినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల (కాపీలు) దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి మాట్లాడుతూ నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకుండా కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలో ఉన్నాయని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ కంపెనీలకి 20 లక్షల కోట్ల పైగా రుణాలను రద్దు చేశారని, రైతుల రుణమాఫీ డిమాండ్ ను పట్టించుకోలేదని అన్నారు. అప్పుల పాలైన రైతాంగం వ్యవసాయం చేయలేక రోజుకి 31 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వీరి గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయటం లేదన్నారు. నూతనంగా తీసుకొచ్చిన మార్కెటింగ్ చట్టం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా కార్పొరేట్లు దోపిడీ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఆసరాగా ఉండే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజువారి కూలీ 600 గా నిర్ణయించాలని అన్నారు. వీటికి నిధులు పెంచాల్సింది పోగా గత బడ్జెట్ కన్నా కూడా 5 వేల కోట్ల  తక్కువగా కేటాయింపులు చేశారని అన్నారు. కార్మిక హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం ద్వారా దోపిడీకి ద్వారాలు తెరిచినట్లేనని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేటాయించకుండా లాభాల్లోకి ఏ విధంగా వస్తుందని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల్లో చేర్చామని  ప్రకటించినా నిధులు కేటాయింపు లేదు అని, జిల్లా అభివృద్ధి గురించి ఎలాంటి ప్రతిపాదనలు లేవు అని, పేదల ఆకలి తీర్చడానికి ఎలాంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సంపన్నులకు మధ్యతరగతి ప్రజానీకానికి మేలు చేసే బడ్జెట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గద్దల బాలకోటయ్య, బాలాజీ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు మీరా, వెంకటేశ్వర్లు, కొండయ్య, లక్ష్మయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)