మాకు ఉపాధి కల్పించకపోతే ఉద్యమం తప్పదు
BSBNEWS- KANDUKUR
ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చి మా ఉపాధి కోల్పోయేలా చేస్తుంది అని, దానికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించకపోతే ఉద్యమం తప్పదని ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ యూనియన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి కుంచాల సిద్దయ్య హెచ్చరించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన మహాసభలో మాకు ఉపాధి కల్పించకపోతే భవిష్యత్తు కార్యాచరణలను రాష్ట్ర కమిటీ తీర్మానించిందని అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుండి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని మేము విధుల్లోకి వెళ్ళటం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమార్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వినతి పత్రాలు అందజేసిన వారు మౌనంగా ఉన్నారే తప్ప మాకు న్యాయం జరిగేటట్టు లేదని, మాకు ఉపాధి కల్పించకపోతే ఉద్యమం తీవ్రతరం చేయటం జరుగుతున్నదని హెచ్చరించారు. మార్చి 15 నుండి 27వ తేదీ వరకు జిల్లాలోని విద్యుత్ ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు మరోసారి మా న్యాయమైన డిమాండ్లను వినతి పత్రం రూపంలో అందించటం జరుగుతుందని, అప్పటికి మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుండి మీటర్ రీడర్స్ అందరూ సమ్మెలోకి దిగడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఫిబ్రవరి 4వ తేదీ చలో విజయవాడ పిలుపుతో మా ఉద్యమం తీవ్రతరం చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఆనంద మోహన్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇ.మాల్యాద్రి, కందుకూరు డివిజన్ అధ్యక్షుడు డి శ్రీను, కోశాధికారి జే.రాము, రీడర్స్ మల్లికార్జున, వంశీకృష్ణ, మధు, కుమార్, శివ, చరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.