కోర్టు పరిధి కుదించడం అశాస్త్రీయం
BSBNEWS - కందుకూరు
కోర్టు పరిధి కుదించడం అశాస్త్రీయం అని కందుకూరు అభివృద్ధి కమిటీ తెలిపింది. గురువారం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి మండలి అధ్యక్షులు డాక్టర్ వి శివరాం ఆదేశానుసారం సమావేశం నిర్వహించామన్నారు. కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిని కుదిస్తూ హైకోర్టు వారు ఆదేశాలను జారీ చేయడం జరిగినది అని, కందుకూరు కోర్టు పరిధిలో ఉన్న పొన్నలూరు, కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ,మండలాలను ఒంగోలు కోర్టు పరిధిలోనికి చేర్చడం సబాబుకాదని, కక్షిదారులు త్రీవ్ర ఇబ్బందులు పడతారని వారు తెలిపారు. దీనికి కారణం రెండవ అతిపెద్ద రెవిన్యూ డివిజన్ అయిన కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడం, కందుకూరు డివిజన్ పరిధిని ఆరు మండలాలకి కుదించడం కారణంగా ప్రకాశం జిల్లాలోని నిలిచిపోయిన పై మండలాలను ప్రకాశం జిల్లా కు చెందిన ఒంగోలుకు తరలించినట్టుగా భావించవలసి వస్తున్నదన్నారు. కందుకూరుకు నెల్లూరు దాదాపుగా 120 కిలోమీటర్ల దూరం వున్నది అని, పొన్నలూరు, కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ, ఒంగోలు కు 40 నుండి 50 కిలోమీటర్ల దూరం 60 కిలోమీటర్ల దూరం ఉన్నదన్నారు. అదే కందుకూరుకు ఈ మండలాలు అత్యంత సమీపంలో ఉన్నవి అని అన్నారు. జిల్లా మారిన కారణంగానే సుదూరమైన నెల్లూరుకు కందుకూరుని మార్చిన కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని కందుకూరు అభివృద్ధి మండలి అభిప్రాయపడుతున్నదన్నారు. రాజకీయవేత్తలు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రమాణం చేసి ఉన్నారు అని, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వందరోజుల్లోనే జిల్లాను మారుస్తాము అని గట్టి ప్రమాణం చేసిన కారణంగా కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని మెజారిటీతో గెలిచినదన్నారు. కానీ ప్రజలు పడుతున్న ఈ కష్టాలను రాజకీయ నాయకులు ప్రస్తావిస్తున్నారు తప్ప జిల్లాను మార్చాలన్న గట్టి ప్రయత్నం వీరిలో కనపడుటలేదన్నారు. కందుకూరులోని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, తూనికల కొలతలు శాఖల డివిజనల్ కార్యాలయాలు తమ స్థాయిని కోల్పోయి కేవలం మండల స్థాయిలోనే కార్యాలయాలు ఉన్నాయని, ఏ పని కావలసిన కావలికి పరిగెత్తుకుని వెళ్లవలసిన దుస్థితి ఏర్పడినదన్నారు. ప్రభుత్వం, పాలకపక్షం, విపక్షాలు ప్రజలు అనుభవిస్తున్న ఈ కష్టనష్టాలను అధిగమించుటకు తక్షణమే కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని, హైకోర్టు వారు తీసుకున్న కోర్టు కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అలా కాని పక్షంలో జిల్లా మార్పు కోసం ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమం నిర్మించి తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండలి ఉపాధ్యక్షులు పాలేటి కోటేశ్వరరావు, కన్వీనర్లు పులిచెర్ల వెంకటసుబ్బారెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.