పొగాకు పంటపై అవగాహన
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని మాలకొండ రాయుని పాలెం గ్రామంలో పొగాకు ఆకు రెలుపులు, క్యూరింగ్, గ్రేడింగ్, పొగాకు బేళ్లు కట్టుట, పొగాకు పంట ఉత్పత్తి తర్వాత నిర్వహణ, పురుగు మందులు వాడుట వలన తలెత్తే ఆరోగ్య సమస్యలు, నివారణ అను అంశంపై పొగాకు రైతులకు, పొగాకు బోర్డు క్షేత్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. ముందుగా పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయం రీజినల్ మేనేజర్ ఒంగోలు ఎం.లక్ష్మణ రావు వారి ఆధ్వర్యంలో పొగాకు కంపెనీల ప్రతినిధులతో కలిసి క్షేత్ర మిత్ర బృందంగా ఏర్పడి కందుకూరు రెండు వేలం కేంద్రాల పరిధిలోని గ్రామాలైన పోకూరు, మాలకొండ రాయుని పాలెం, సింగర బోట్ల పాలెం, హాజీ పాలెం, ఇతర గ్రామాలలో పర్యటించి పొగాకు రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకొని తగు సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముందుగా బోర్డు అధికారులు, కంపెని ప్రతినిధులు పొగాకు తోటలు, పొగాకు క్యూరీంగులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరూ రెండు వరుసల్లో అంతర సేద్యం చేసుకోవాలన్నారు. పొగాకు లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమా మెక్టిన్ బెంజోయెట్ 5 గ్రా మందును 10 లీ కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. శనగ పచ్చా పురుగు ఉన్నట్లయితే ఇమిడా క్లోప్రిడ్ 3 మి.లీ మందును 10 లీ. నీటిలో కలుపుకొని పిచికారి చేయాలన్నారు. పొగతోటల్లో చిన్న మొక్కలు ఉన్నట్లయితే ఎకరానికి 25 కేజీలు అమోనియం సల్ఫేట్ మొక్కలకు చల్లుకోవాలన్నారు. పొగ తోటలు బెట్టకు వచ్చినట్లు ఐతే ఒక నీటి తడి ఇవ్వాలని,(35 నుండి 45 రోజుల తోటలకు మాత్రమే) లేదా నీటిలో కరిగే ఎరువులను వాడాలని తెలిపారు. ఆకు ముడత ఉన్న మొక్కలను పీకి వేసుకోవాలి అని, లేదా థయామిథాక్సామ్ 3 గ్రాములు మందును 10 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. పూర్తిగా పక్వానికి వచ్చిన ఆకులను మాత్రమే తుంచి అల్లి బ్యారన్ లో అమర్చాలన్నారు. తప్పనిసరిగా టార్పలిన్ పట్టాలను వాడాలని తెలిపారు. దానివలన ఇతర అన్యపదార్థాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని అన్నారు. పచ్చి ఆకులను ఎండ తగలకుండా జాగ్రత్త పడాలని, ఆకులు అల్లినప్పుడు ఎక్కువగా పండిన ఆకులు, పక్వానికి రాని ఆకుపచ్చని ఆకులు, పక్వానికి వచ్చిన ఆకులు విడివిడిగా కర్రలకు అల్లుకోవాలన్నారు. పచ్చి ఆకులు నేలపై కాకుండా టార్పలిన్ పట్టలపై దించి అల్లుకోవాలన్నారు. పొగాకు క్యూరింగ్ లో తీసుకోవలసిన మెలకువలు అనగా బ్యారన్ లీకేజీలు లేకుండా పొగ గొట్టాలపై ఇనుప జాలి అమార్చడం వలన అగ్నిప్రమాదం నివారించవచ్చు అని అన్నారు. వెంచూరి పోయి బిగించడం ద్వారా పుల్ల ఖర్చు ఆదా చేయవచ్చు అని తెలిపారు. బ్యారన్ లోఉష్ణోగ్రత తెలియపరిచే క్యూరో మీటర్ తప్పనిసరిగా అమర్చి, ఏట్టి పరిస్థితులలోనూ బ్యారన్ పరిమితికి(1000 నుండి 1200) మించి కర్రలు ఎక్కించరాదన్నారు. పొగాకు మండెలు చేయు విధానము, గ్రేడింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొగాకు గ్రేడింగ్ చేయు విధానము, పొగాకులో ఇతర అన్య పదార్థాలు కలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఎఫ్ సి ఆర్ 15 రకం పక్వానికి త్వరగా రావడం లేదు కాబట్టి 2 లేదా 3 రోజులు ఆలస్యంగా ఆకులు రెలుపుకోవలన్నారు. బ్యారన్ లో ఆకు ఎక్కించిన తరువాత పంటకు రానట్లయితే బ్యారన్ లో నేల పై తడి గోనె సంచలలో పరుచుకోవలన్నారు. తద్వారా బ్యారన్ లోపల తేమశాతం పెరిగి ఆకులు త్వరగా పంటకు వస్తాయన్నారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయించుకునే వాళ్ళు బోర్డు దగ్గరికి వచ్చి బోర్డు క్షేత్ర సహాయాధికారి లేదా బోర్డు క్షేత్రాధికారికి తెలియపరచి అనుమతి తీసుకోవలన్నారు. మధ్య ధళారులకు కానీ ఇతరులకు కానీ ప్రభోవాలకు లొంగి పొగాకు అమ్మకాలు కానీ కొనుగోలు కాని చేయరాదన్నారు. అటువంటి సంఘటన ఉన్నట్లయితే పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులుకు కానీ పొగాకు బోర్డు సిబ్బందికి తెలపాలన్నారు. అక్కడ అక్కడ పొగాకు తోటల్లో పొగాకు మల్లె కనిపిస్తున్నందువలన సామూహికంగా పొగాకు మల్లెను పుష్పించక ముందే పీకి వేసి పొగాకు తోటలకు దూరంగా తీసుకుని వెళ్లి తగలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణ అధికారి చంద్ర శేఖర్, సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ కే రాజగోపాల్, జి. వెంకట్రావు(ఐటి సి ప్రతినిధి) , ఉన్నం శ్రీనివాస రావు (డెవలప్మెంట్ మేనేజర్ జి.పి.ఐ) పొగాకు బోర్డు క్షేత్ర సిబ్బంది, పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు.