పంటలకు గిట్టుబాటు ధర కోసం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి.
- ప్రజాసంఘాల డిమాండ్
BSBNEWS - కందుకూరు
రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పక్కనపెట్టి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. పెట్టుబడులు అధికమై, గిట్టుబాటు ధర రాక, అప్పుల పాలై ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా, వరి, పొగాకు, మిర్చి, శనగ పంటలు వేసారని, అధిక పెట్టుబడులతో, ఎంతో శ్రమకోర్చి రైతులు పండించినప్పటికీ, గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పొగాకు పంటకు క్వింటాకు సగటు ధర 35 వేల రూపాయలు ఇవ్వాలని, మిర్చి క్వింటాకు 25000 ఇవ్వాలని, వరి ధాన్యానికి క్వింటాకు 4500 ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గుడ్లూరు, ఉలవపాడు మండల కార్యదర్శి కొట్టే వెంకయ్య, ఎస్డి గౌస్ బాషా, రైతు సంఘం గుడ్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు దామా కృష్ణయ్య, వర్ధినేని సిద్దయ్య, సిఐటియు నాయకులు దాసరి రామమూర్తి, డి ఎం రాయుడు, చిమటా శ్రీనివాసులు, ఉప్పు వెంకటేశ్వర్లు, ఐద్వా నాయకులు ఎస్.కె మల్లిక, ఎం పద్మావతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పొట్లూరు రవి, మెడ బలిమి ప్రసాద్, కెవిపిఎస్ జిల్లా నాయకులు మాధవ మూర్తి, నేలటూరి తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.