మద్యం దుకాణాన్ని మరో ప్రదేశానికి తరలించాలి
- బి.సురేష్ బాబు డిమాండ్
BSBNEWS - కందుకూరు
ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రదేశంలో గాంధీ విగ్రహానికి అతి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మరో ప్రదేశానికి తరలించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు అతి సమీపంలో ఉన్న ప్రదేశంతో పాటు కూత వేటుదూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయటం ప్రజలకు మనోవేదన కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో వ్యవసాయ శాఖగా సబ్ డివిజన్ కార్యాలయం, ఐ సి డి ఎస్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, విద్యాశాఖ కార్యాలయం ,మండల పరిషత్ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాలు, ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు సమస్యలపై వస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రానికి , వెలుగు కార్యాలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారని ఎంత రక్షణ ఉన్నా మద్యం మత్తులో ఉన్న మందుబాబులు మహిళలపై తెగింపు చర్యలు చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. మద్యానికి వ్యతిరేకంగా జాతిని మేల్కొల్పిన మహాత్మా గాంధీ విగ్రహానికి 200 మీటర్ల సమీపంలో మద్యం దుకాణం ఉండరాదని నిబంధన ఉన్న 200 మీటర్ల లోపు ఆయన విగ్రహం ఉన్న ఏ విధంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారని, ప్రభుత్వం అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో ప్రజలకు వివరించాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మద్యం దుకాణాన్ని మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో మద్యం దుకాణం తరలించే వరకు ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు ద్రోణాదుల ఆదినారాయణ, ఉప్పుటూరి మాధవరావు తదితరులు పాల్గొన్నారు