మాకు పని కల్పించండి ఎమ్మెల్యే సారు..
నాకు సంబంధం లేదంటూ ఆగ్రహించిన ఏపీడి
BSBNEWS - కందుకూరు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించి నిరుపేదలకు ఆసరాగా నిలవాల్సిన పథకం నిరుపయోగంగా పోతుందని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా వలేటివారిపాలెం మండలంలో పలు పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరగకపోవటమే. ఇది ఇలా ఉంటే మండలంలోని పోలినేనిచెరువు గ్రామంలో మూడు వారాల నుంచి పని నిర్వహిస్తూ నాలుగో వారం పని ఆపడం జరిగింది. అక్కడి గ్రామస్తులను ఉపాధి హామీ పథకం గురించి అడగగా ఆ మూడు వారాలపాటు జరిగిన పనికి కేవలం 10మంది లోపు కూలీలను తీసుకువెళ్లి పని చేపించారని, ఈవారం పని ఆపేశారని చెప్పడం జరిగింది. అయితే పని కల్పించింది పది మందికి అయితే ఎంతమందికి మస్టర్లు వేశారో తెలియాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం పనులు చేపించే వారు సక్రమంగా లేకపోవడమే ఈ విధంగా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది మాకు పని కల్పించండి అని చెప్పినా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పట్టించుకోవటం లేదని చెప్పడం విశేషం. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇటీవల ఏపీడి బాబురావు వలేటివారిపాలెంలో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పని దినాలను కల్పించి ఉపాధి కూలీలకు 300 రూపాయలు వచ్చేలా చూడాలని ఆదేశించిందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పడం జరిగింది. కానీ వలేటివారిపాలెం మండలంలో పెరిగే కూలీల వేతనం కన్నా అసలు పనే జరగకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మాకు పని కల్పించండి ఎమ్మెల్యే సారూ అంటూ ఆ గ్రామస్తులు కొంతమంది ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
నాకు సంబంధం లేదు ఏపిడి వివరణ
పోలినేనిచెరువులో పని కల్పించడం లేదని వివరణ కోసం ఏపీడి బాబురావుకు ఫోన్ చేయగా ప్రతి విషయం నాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు అని ఆవేశంతో ఆగ్రహించారు. మీకు సమాచారం కావాలంటే ఎంపీడీవో ఉంటాడు ఆయనను అడగండి అంతేకానీ నాకు ఫోన్ చేయొద్దు అని అతనికి ఉపాధి హామీ పథకం కు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా ఆగ్రహించటం గమనార్హం.