పలుకూరు, మహాదేవపురం లో పొలం పిలుస్తుంది
BSBNEWS - కందుకూరు
మండలంలోని పలుకూరు, మహాదేవపురం గ్రామంలో మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎ డి ఎ) పి.అనసూయ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి రైతుకి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని సులభతరం చేసి పారదర్శకంగా సేవలను అందించడం కోసం చేయబడుతున్న బృహ హత్కరమైన రైతు ప్రత్యేక గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమం అని తెలియజేసారు. రైతులు మీ సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు ఆధార కార్డు, పట్టాదారు పాసు పుస్తకాలు, మొబైల్ నెంబర్ తీసుకొని ప్రత్యేక పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేసుకుని ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చునని, తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే వివిధ రకాల పథకాలు, రాయితీలు, పి ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యంత్ర పరికరాలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలు, తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. మండల వ్యవసాయాధికారి వి. రాము మాట్లాడుతూ రైతులు అందరూ తప్పనిసరిగా రబీ సీజన్లో వేసిన ప్రతి పంటను పంట నమోదు చేసుకోవడంతో పాటు కె వై సి చేసుకోవాలని కోరారు. అనంతరం పలుకూరు గ్రామంలో వేసిన వరి పంట రకం ఎన్ ఎల్ ఆర్ 33892 పరిశీలించి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మాని పండు తెగులు సోకిందని దీని నివారణకు చిరు పొట్ట లేదా వెన్ను దశలో ప్రాపికొనజోల్ 200 మి. లీ. ఒక ఎకరానికి వారం వ్యవధిలో రెండు సార్లు సాయంత్రం వేళలో పిచికారి చేయాలి అని సూచించారు. పలుకూరు ప్రకృతి వ్యవసాయ హెల్త్ & న్యూట్రిషన్ ( ఐ సి ఆర్ పి)సిబ్బంది ఏ.శ్రీలక్ష్మి మాట్లాడుతూ సేంద్రియ పద్ధతులతో పండించిన పంటలు, కిచెన్ గార్డెన్ ద్వారా మేలైన ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల గ్రామ ఉద్యాన సహాయకురాలు, వ్యవసాయ సహాయకులు ఐ. బ్రాహ్మణి, షేక్ నజీర్ భాష, పశు వైద్య సహాయకులు కె వి చైతన్య, పి.శరణ్య కుమారి, పలుకూరు ఎం పి టి సి స్వర్ణ పున్నయ్య, గ్రామ పెద్ద నార్నే రోశయ్య, రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.