ఎంపీడీవో పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు
BSBNEWS- నెల్లూరు
లింగసముద్రం మండలంలో ప్రజా పరిషత్ అధ్యక్షులు పెన్నా కృష్ణయ్య అధ్యక్షతన ఈనెల 23న జరిగిన సర్వసభ్య సమావేశమును ఉద్దేశపూర్వకంగా జరగనివ్వకుండా ప్రయత్నం చేసి తప్పుడు దారి పట్టించిన ఎంపీడీవో పై తగిన చర్యలు తీసుకోవాలి అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారికి ఎంపీపీ పెన్నా కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారని, సమావేశం నిర్వహించే ఎంపీడీవో తగిన జాగ్రత్తలు చేపట్టకుండా సమావేశ మందిరంలోకి సంబంధం లేని వ్యక్తులు బలవంతంగా వస్తుంటే చూస్తూ ఉద్దేశపూర్వకంగా సమావేశం జరగకుండా ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సి.ఈ.ఓ ను కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఈఓ ఎంపీడీవోను ఫోనులోనే మందలిస్తూ ప్రజా ప్రతినిధులను పరిగణలోకి తీసుకొని పనిచేయాలని సమస్యను పెద్దది చేయకుండా పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ను కలసి మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్నప్పుడు సమావేశానికి ఎటువంటి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించి అధికారులను, మండల సభ్యులను, సమావేశంలో పాల్గొన్న ప్రజా పరిషత్ అధ్యక్షులను, ఎమ్మెల్సీ నీ బెదిరించే విధంగా వ్యవహరిస్తూ సమావేశాన్ని జరగకుండా అడ్డుకున్నారని, వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశామన్నారు. వారితో పాటు కలెక్టరేట్ లో పరిపాలన అధికారిని కలిసి మండల సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా జరగకుండా ప్రయత్నం చేసిన ఎంపీడీవో పై డిపార్ట్మెంటల్ గా చర్యలు తీసుకోవాలని తగిన ఆధారాలతో వినతి పత్రమును సమర్పించామన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొన్న సమావేశంలో రసాభాస సృష్టించిన వ్యక్తులను, ఎంపీడీవో పై తగిన ఆధారాలతో శాసనమండలి చైర్మన్ కు, ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రారెడ్డి పాలెం సర్పంచి డబ్బుకొట్టు మల్లికార్జున, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.