అట్టహాసంగా ముగిసిన క్రికెట్ పోటీలు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని బాలుర హైస్కూల్ మైదానంలో గత వారం నుండి జరుగుతున్న కేపిఎల్ సీజన్ 4 క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. స్ధానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించిన ఈ పోటీలు పట్టణ ప్రజలను, క్రికెట్ అభిమానులను బాగా అలరించాయి. వారం రోజుల పాటు ఆధ్యంతం ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగాయి. వివిధ జిల్లాల నుండి సెలెక్టెడ్ గా 16 జట్లు పాల్గొనగా పలు జిల్లాల తోపాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి క్రీడాకారులు ప్రత్యేకంగా వచ్చి ఈ టోర్నమెంట్‌లో ఆడటం విశేషం. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఒంగోలు ఏసీసీ జట్టు సింగరాయకొండ ఎస్కేసీసీ జట్టు తలపడగా ఒంగోలు జట్టు విజయం సాధించింది. చిరుపాటి వ్యత్యాసంతో సింగరాయకొండ జట్టు రన్నరప్ గా మిగిలింది. మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండవ బహుమతి యాభై వేలు రూపాయలు తోపాటు క్రికెట్ ట్రోఫీని ఇరు జట్లు అందుకున్నాయి. ఫైనల్ విజేతలకు అతిధులుగా విచ్చేసిన ప్రణవి వైద్యశాల డాక్టర్ నవీన్ కుమార్, ఉడ్ ల్యాండ్స్ హోటల్ కృష్ణా, సీనియర్ ప్లేయర్ కొంగల నాగరాజు కలిసి బహుమతులను అందజేశారు. దూరప్రాంతాల నుండి వచ్చి క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను సీనియర్ ప్లేయర్ కొంగల నాగరాజు అభినందించారు. టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పట్టణ యువకులు, క్రీడాకారులపై ప్రేమతో కందుకూరులో ఆట స్థలానికి హామి ఇచ్చారని చెప్పారు. క్రికెట్ ఆటలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఆడుతున్న క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్ మెన్ గా హరీష్, బెస్ట్ బౌలర్ గా రసూల్ సింగరాయకొండ టీంకు చెందిన ప్లేయర్లు కైవసం చేసుకున్నారు. టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది సిరిస్ గా ఒంగోలు టీంకు చెందిన బాలాజీ సాదించారు. కేపిఎల్ టోర్నమెంట్ కు విచ్చేసిన అతిధులకు, నాయకులకు, క్రీడాకారులకు, పట్టణ ప్రజలకు టోర్నమెంట్ నిర్వహకులు జలీల్, మస్తాన్ వలీ, రియాజ్, తాసిన్, నాగరాజు, నాయబా లు అభినందనలు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.