శాసనసభలో గళమెత్తిన ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలోని పలు సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదములు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో 493/1 సర్వే నెంబర్ లో ఉన్న గ్రామ కంఠం భూమిని గత ప్రభుత్వంలో వైసిపి నాయకులు అప్పటి పంచాయతీ సెక్రెటరీ తో 493/1A తప్పుడు సర్టిఫికెట్లు పొంది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని, అది ముస్లిం కమ్యూనిటీకి చెందిన పీర్ల చావిడి స్థలం అని దానిపై తగు విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో 7.88 ఎకరాల ఇనామ్ స్థలంను వైసీపీ జడ్పిటిసి చెన్ను ప్రసాద్ ఆక్రమించుకొని భూరికార్డులు ఎక్కించుకున్నారని దీనిపై విచారణ జరపవలసిందిగా కోరారు. లింగసముద్రం మండలం యర్రరెడ్డిపాలెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు నూతనంగా ఇల్లు నిర్మించుకొనుటకు నివాస స్థలాల రిజిస్ట్రేషన్స్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నందు ప్రస్తావించారు. ఈ విషయంపై అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పిన పొజిషన్ సర్టిఫికెట్ ను గత వైసిపి ప్రభుత్వంలో ఇచ్చారు అని, దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు వేసి ఉన్నదన్నారు. పొజిషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై తప్పకుండా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.